ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 8:17 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎల్నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి వేసవి తాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట,అర్జున్ సమాచారం:
జిల్లాలో ఎల్నినో ప్రభావం కారణంగా భూగర్భ జలమట్టాలు తగ్గి, నీటి ఎద్దడి తలెత్తే అవకాశాలున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విద్యుత్, వ్యవసాయ, నీటిపారుదల, మిషన్ భగీరథ, భూగర్భ జల వనరులు, పశుసంవర్ధక శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, అక్టోబర్ నెలలోనే పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నట్లు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతోందని తెలిపారు. గతంలో అనేక సంవత్సరాలుగా నీటిని అందించిన బోర్లు సైతం ప్రస్తుతం ఎండిపోతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. వేసవి నాటికి నీటి సమస్య మరింత తీవ్రతరం కాకుండా ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాటి సామర్థ్యం, నీటి సరఫరా పరిస్థితులు, సమస్యాత్మక గ్రామాలు, తండాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైన నిధుల అంచనాలను రూపొందించి, వాటి సమీకరణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యలపై శాఖల మధ్య సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
భూగర్భ జలాల మట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో బోర్ల రీఛార్జ్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. మంజూరైన పనులను వేగవంతం చేయడంతో పాటు, లక్ష్యాలకు అనుగుణంగా పనుల పురోగతి సాధించాలని ఆదేశించారు. బోర్ల రీఛార్జ్ నిర్మాణాలకు అవసరమైన సాంకేతిక సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపించి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. నీటి వనరుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నీటి నిల్వలు, భూగర్భ జలమట్టాలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
తాగునీటి సరఫరా, సాగునీటి అవసరాలకు విద్యుత్ సరఫరా కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు నీటి వనరులు, సాగునీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.